రహస్యాలు
రహస్యాలు
దేవుని వద్ద కొబ్బరికాయను ఎందుకు కొడతారు. ?
సర్వదేవతలన పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదులలోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పని సరి .
కొబ్బరి కాయ పైనున్నపెంకు మన అహంకారానికి ప్రతీక . ఎప్పుడైతే కొబ్బరి కాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని , లోపలున్న తెల్లని కొబ్బరిలా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరి కాయే .
కొబ్బరికాయ అంటే మానవ శరీరం . బొండం పైనున్న చర్మం, మన చర్మం,, పీచు మనలోని మాంసం, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరినీరు మన ప్రాణాధారం., కాయపైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు .
గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తుంటారు .
ప్రదక్షిణం లో 'ప్ర' అనే అక్షరము పాపాలకి నాశనము ., 'ద' అనగా కోరికలు తీర్చమని , 'క్షి' అన్న అక్షరం మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. 'ణ' అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని . గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉంది .
పూర్వము ఆదిలో వినాయకుడు పార్వతి - పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు . కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణం అవుతుంది . భగవంతుడా ! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.
గుడికి వెళ్ళేటప్పుడు తల స్నానం ఎందుకు .
తల స్నానం చేసే వెళితే శరీరము మొత్తం శుచిగా ఉంచుకొని దర్శనం చేసుకున్నట్టు . మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడు అనేక విధాలుగా కామ , క్రోధ , లోభ , మదాలతో నిండి ఉంటుంది . ఆ మనసుని పవిత్రంగా , పరిశుద్ధంగా చేసుకొని వెళ్లే ఆధ్యాత్మిక శక్తి మనసుకు లేదు గనుక , కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరుచుకొని దర్శించుకుంటున్నాము .
ఈ శరీరంలా మనుసును శుచిగా , నిర్మలంగా ఉండేలా చెయ్యమని అర్ధమే పూర్తి స్నానము యొక్క భావము .
గుడిలో శఠగోపనం {షడగోప్యం} వల్ల ఫలితాలు .
దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్ధం , షడగోప్యం తప్పక తీసుకోవాలి . చాలా మంది దేవుడిని దర్శనం చేసుకున్నాక వచ్చినపైనైపోయింది అని కూర్చుంటారు . కొద్దిమంది మాత్రమే ఆగి , షడగోప్యం పెట్టించుకుంటారు.
షడగోప్యం అంటే అత్యంత రహస్యం . అది పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరికను తలుచుకోవాలి .
అంటే మీ కొరికే షడగోప్యము . మానవునికి శత్రువులైన కామమూ , క్రోధము , లోభము , మొహమూ , మదము , మాత్సర్యములు వంటివి ఇకనుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటము మరో అర్ధం .
షడగోప్యంలో రాగి, కంచు, వెండి లోహాలతో తయారుచేస్తారు పైన విషుణువు పాదాలు ఉంటాయి. తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ , దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి , మనలోని అధిక విదుత్ బయటకెళుతుంది . తద్వారా శరీరంలో ఆందోళనా , ఆవేశము తగ్గుతాయి . షడగోప్యము ను శఠగోపనం అని కూడా అంటారు .
గుడిలో కాసేపు ఎందుకు కూర్చోవాలి .
దర్శనము మరియు షడగోపము అయ్యాక కొంతసేపు కూర్చొని వెళ్ళాలి . అలా కూర్చోమనేది ప్రశాంతత కోసము , పుణ్యం కోసము . అలా కూర్చోటం ద్వారా దర్శనము ఫలిస్తుంది . అలా కూర్చున్నపుడు మంచి చెడులు బేరేజి వేసుకుంటాము . ప్రశ్నతమైన మనసుతో ఆలోచిస్తాము . ఏది తప్పు , ఏది ఒప్పు అని ఆలోచిస్తాము . రోజువారీ జీవన విధానాన్ని సరి చేసుకొని సరైన మార్గం లో నడుస్తాము .
గుడిలో కూర్చోటం అనేది ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా . కేవలం కూర్చోటమే కాకుండా ఓ రెండు నిముషాలు కనులు మూసుకొని ధ్యానం చేయటం చాలా మంచిది శుభము.
పిల్లలకు పుట్టు వెంట్రుకలు ఎప్పుడు తీయాలి?
పిల్లలకు ‘9 ‘ వ నెలలో కాని, ’11 ‘వ నెలలో కాని, ‘3 ‘వ సంవస్తరం లో కాని తీయవలెను.
పిల్లలకు అన్నప్రాసన ఎన్నో నెలలో చేయాలి ?
ఆడ పిల్లలకు ‘5 ‘ వ నెలలో, మగ పిల్లలకు ‘6 ‘ వ నెలలో అన్న ప్రాసన చేయాలి. 6 నెల 6వ రోజున ఇద్దరికీ పనికివస్తుంది.
పంచామృతం, పంచగవ్యములు అని దేనిని అంటారు ?
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, వీటిని పంచామృతం అని,
ఆవు పాలు,ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రము, వీటిని పంచగవ్యములు అంటారు.
ద్వారానికి అంత ప్రాముక్యం ఎందుకు ఇస్తారు?
ద్వారానికి పైనున్న కమ్మి లక్ష్మి స్వరూపము, అందుకే దానికి మామిడి తోరణం కడతారు. క్రింద కమ్మి పవిత్రమైనది, కనుక దానికి పసుపు రాస్తారు. శాస్ర పరంగా చెప్పాలంటే గడప కు పసుపు రాయడం వల్ల క్రిమి కీటకాలు, విష పురుగులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి అనుకోవచ్చు.
తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?
తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.
తీర్థ మంత్రం:
అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం
సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .
స్నానము ఎలా చేయ వలెను?
నది లో ప్రవహమునకు ఎదురుగ పురుషులు, వాలుగ స్త్రీలు చేయవలెను.
చన్నీటి స్నానము శిరస్సు తడుపుకొని, వేడి నీటి స్నానము పాదములు తడుపుకొని ప్రారంబించ వలెను. స్నానము చేయునపుడు దేహమును పై నుండి క్రింద కు రుద్దు కొనిన కామేచ్చ పెరుగును. అడ్డముగా రుదుకోనిన కామేచ్చ నశించును. సముద్ర స్నానము చేయునపుడు బయట మట్టి ని లోపలి వేయవలెను. నదులలో,కాలువలు,చెరువులలో చేయునపుడు లోపల మట్టిని ముమ్మారు బయట వేయవలెను.(అవి పూడి పోకుండా ఉండటానికి)
ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితము ఉంటుంది?
గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది. నది ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది.
గోశాలలో చేస్తే వంద రెట్లు, యాగశాలలో అంతకు మించి ఫలితం వస్తుంది. పుణ్య ప్రదేశాల్లో,
దేవాతా సన్నిదిలోను చేస్తే పదివేల రెట్లు వస్తుంది. శివసన్నిదిలో చేస్తే మహోన్నతమైన ఫలం వస్తుంది. పులి తోలు మీద కుర్చుని జపిస్తే మోక్షం కలుగుతుంది. అలాగే వెదురు తడక మీద కుర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది. రాతి మీద కుర్చుని జపిస్తే రోగాలు వస్తాయి. నేల మీద కూర్చొని చేస్తే దుఖము, గడ్డి మీద చేస్తే కీర్తి నాశనం అవుతుంది.
పూజగది తూర్పు ముఖంలో ఉండాలని ఎందుకు అంటారు?
తూర్పునకు అధిపతి ఇంద్రుడు, ఉత్తరానికి అధిపతి కుబేరుడు. అందుకే పూజగది తూర్పుముఖంగా కాని, ఉత్తరముఖం గా కాని ఉండాలని అంటారు. దక్షిణానికి అధిపతి యముడు. అందుకే దక్షిణ ముఖం గా ఉండకూడదని అంటారు.
ఏ ఏ సమయాల్లో ఏ దేవుణ్ణి పూజించాలి?
సూర్య భగవానుని 4.30 నుంచి ఆరులోగా పూజించాలి. ఈ సమయంలో పూజ శ్రీ రామునికి, శ్రీ వెంకటేశ్వరునికి కూడా ప్రీతీ. ఆరు నుంచి ఏడున్నర వరకు మహాశివుడ్ని, దుర్గను పూజించిన మంచి ఫలము కలుగును. మధ్యాహ్నము పన్నెండు గంటలప్పుడు శ్రీ ఆంజనేయ స్వామిని పూజించిన హనుమ కృపకు మరింత పాత్రులగుదురు. రాహువునకు సాయంత్రము మూడు గంటలకు పూజించిన మంచి ఫలితము కలుగుతుంది. సాయంత్రం ఆరు గంటల సమయాన అనగా సూర్యాస్తమయమున శివపూజకు దివ్యమైన వేల.రాత్రి ఆరు నుంచి తొమ్మిది వరకు లక్ష్మీదేవిని పూజించిన ఆమె కరుణ కటాక్షములు ఎక్కువగా ఉంటాయి. తెల్లవారు జామున మూడు గంటలకు శ్రీమహా విష్ణువును పూజిస్తే వైకుంటవాసుడి దయ అపారంగా ప్రసరిస్తుంది.( ఇది నిబంధన మాత్రం కాదు. సమయానుకూలంగా కూడా మీ ఇష్ట దైవమును పూజించవచ్చు)
హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?
కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు. ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.
ఈశాన్యాన దేవుణ్ణి పెట్టె వీలులేఖపోతే?
మారిన జీవన పరిణామాల దృష్ట్యా, ఉద్యోగ నిర్వహనలవల్ల ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. అలాంటప్పుడు దేవుణ్ణి ఈశాన్యాన పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు దేవుడు పశ్చిమాన్ని చూసేలా ఏర్పాటు చేసుకోవాలి.
పిల్లలు లేని వారు సుబ్రమణ్యస్వామిని ఎందుకు పూజిస్తారు?
పార్వతి,పరమేశ్వరులను దర్శించడానికిఅనేక మంది తాపసులు కైలసానికి వస్తారు. అందులో దిగంబర ఋషులు ఉండటంతో సుబ్రమణ్యస్వామి హేళనగా నవ్వాడు. దానికి పార్వతిదేవి పుత్రుని మందలించి, మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్ణ్తిచినవి, జాతికి జన్మస్థానాలు అని తెలియచెప్పింది. తల్లి జ్ఞాన భోధతో సుబ్రమణ్యస్వామి సర్పరూపం దాల్చాడు కొంతకాలం. జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెల్సిందే. ఆ తర్వాత వాటికి అధిపతి అయాడు. అందువల్లే జీవకణాల అధిపతి అయిన సుబ్రమణ్యస్వామి ని పూజిస్తే పిల్లలు పుట్టని దంపతులకు సంతానం కలుగుతుంది.
మహాభారాతాన్ని వినాయకుడు ఎక్కడ వ్రాశాడు?
వ్యాసుడు చెపుతుంటే వినాయకుడు ఘంటం ఎత్తకుండా వ్రాసింది మన భారత దేశ చివర గ్రామమైన “మాన ” లో. హిమాలయాల్లో ఉంది ఈ గ్రామం. భదిరినాత్ వెళ్ళినవారు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని దర్శిస్తారు. “జయ” కావ్యమనే మహాభారతాన్ని వినాయకుడు వ్యాసును పలుకు ప్రకారం రాస్తుంటే పక్కన ప్రవహిస్తున్న సరస్వతి నది తన పరుగుల, ఉరుకుల శబ్దాలకి అంతరాయం కలగకూడదని మౌనం వహించి ప్రవహిస్తుంది. ఈ అధ్బుతాన్ని మీరు ఇప్పుడు కూడా చూడవచ్చు. ఆ ప్రదేశాన్ని దాటగానే మల్లి గలగలలు.
శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ఎందుకు ధరిస్తాడు?
సృష్టి లో సంభోగం చెయ్యని ప్రాణి నెమలి మాత్రమే. శ్రీ కృష్ణుని పదహారువేలమంది గోపికలు. అన్నివేల మంది భామలతో శ్రీ కృష్ణుడు సరససల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు. అంతవరకే మెలిగాడు. ఆవిషయాన్ని తెలియచేయడమే శ్రీకృష్ణుడి పైనున్న నెమలిపించం భావం. శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా ఉన్నానని పదపదే చెప్పడమే నెమలిని ధరించడం. నెమలి అంత పవిత్ర మయినది కనుకే మన జాతీయపక్షి అయింది.
అయిదో తనమంటే ?
ముత్తయిదువ అని అర్థం. పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగల్యం. స్త్రీ ఈ అయిదు అలంకరణలతో కల కల లాడుతుండాలి. స్త్రీకి వివాహం అయిన తర్వాతే మెట్టెలు, మాంగల్యం వస్తాయి.
స్త్రీలు జుట్టు విరబోసుకొని ఎందుకున్డరాదు?
ఈ చర్య పిశాచాలకు ఆహ్వానం వంటిది. అనేక దుష్ట గ్రహాలూ ఆ సమయంలో ఆవహించి కల్లోలపరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది. దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పురుశిడికి ఆ స్త్రీమీద కామం కలుగుతుంది. తద్వారా కుటుంబ సమస్యలు వస్తాయి. అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మిదేవి అక్కకు కూడా ఆహ్వానమే.!
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును. అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.